కడప జిల్లా రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన కందుకూరి గౌస్‌పీర్ తన భూవివాదంలో జరుగుతున్న అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసు శాఖ, ఉన్నతాధికారులను కోరారు. బుధవారం ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తనపై, తన కుటుంబంపై జరుగుతున్న వేధింపుల వివరాలను వెల్లడించారు.

తన సొంత భూమికి సంబంధించి సోదరులు, తల్లితో కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని గౌస్‌పీర్ తెలిపారు. ఈ వివాదంపై కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ, ఆదేశాలను పట్టించుకోకుండా తనపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ నెల 9న తన సోదరుడు హుస్సేన్‌బాషా, అతని కుమారులు హరీఫ్, అలీ హుస్సేన్, తమ్ముడి భార్య మహబూబ్‌చాన్, తల్లి బీబీ కలిసి తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారని గౌస్‌పీర్ పేర్కొన్నారు. దాడి సమయంలో దుర్భాషలాడడంతో పాటు తన సెల్‌ఫోన్‌ను కూడా లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనలపై రాజుపాలెం పోలీసు స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గౌస్‌పీర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తనపైనే రెండు అక్రమ కేసులు నమోదు చేశారని, దీంతో తాను మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే తన భార్యను చెప్పుతో కొట్టినా, ఆ ఘటనపై కూడా కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.

ఈ పరిణామాలపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం, ప్రత్యర్థి వర్గం మరింత రెచ్చిపోయిందని గౌస్‌పీర్ పేర్కొన్నారు. జేసీబీ, ట్రాక్టర్లతో తమ పొలానికి వెళ్లే దారిని దున్నేసి పూర్తిగా మూసివేశారని, దీంతో ప్రస్తుతం తాము వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

తన కుటుంబం ప్రాణ భయంతో జీవిస్తున్నదని, భూమికి వెళ్లే మార్గం లేక వ్యవసాయం ఆగిపోయిందని గౌస్‌పీర్ వివరించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయించే బాధ్యత పోలీసులదేనని, కానీ స్థానిక పోలీసుల వైఖరి కారణంగా తాను న్యాయం కోసం తిరుగుతున్న పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని, రాజుపాలెం పోలీసుల పనితీరును పరిశీలించి, భూవివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని గౌస్‌పీర్ డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తన భూమిపై తనకున్న హక్కును రక్షించేలా చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.