స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదాసు మురళి అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రొద్దుటూరు నందిని క్లోత్ మార్కెట్ట్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాసు మురళి మాట్లాడారు. పట్టణంలోని బంగారం, పట్టు వస్త్రాలు, చిల్లర వ్యాపారాలు తదితర రంగాల్లో స్థానిక వ్యాపారులు ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకంతో వ్యాపారాలు నిర్వహిస్తూ అనేక కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే స్థానిక వ్యాపారులను దెబ్బతీసే విధంగా పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తే చిన్న, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని మురళి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే పరిస్థితులు వస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

ప్రజలు కూడా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని మాదాసు మురళి కోరారు. స్థానిక వ్యాపారాల బలోపేతంతోనే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ దృఢపడుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థానిక వ్యాపారులకు మద్దతు ప్రకటించడంపై మాదాసు మురళి విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి స్థానిక వ్యాపారులను దెబ్బతీసిన వారు, ఇప్పుడు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.

చిన్న, చిరు వ్యాపారుల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున పోరాడతామని మాదాసు మురళి స్పష్టం చేశారు. స్థానిక వ్యాపారుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

స్థానిక వ్యాపారి బలపడితేనే మన ప్రాంతం బలపడుతుంది