రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణంలోని స్థానిక వ్యాపారులను ప్రోత్సహించి, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం దొరసానిపల్లెలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రొద్దుటూరు ప్రారంభం నుంచే వస్త్ర, బంగారం, కాటన్, ఆయిల్ తదితర వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ప్రధాన వాణిజ్య కేంద్రంగా పేరుపొందిందని రాచమల్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక వ్యాపారుల పాత్రను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు, పెద్ద షాపింగ్ మాల్స్ పట్టణంలోకి రావడంతో స్థానిక వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పండుగల సమయంలో భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమ్మకాలు నిర్వహించడం వల్ల చిన్న వ్యాపారులు నష్టపోతున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన వివరించారు.
ఏళ్ల తరబడి స్థానిక వ్యాపారులు ప్రజలకు అరువు, గ్యారంటీ, రీప్లేస్‌మెంట్ వంటి సదుపాయాలు అందిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తున్నారని రాచమల్లు చెప్పారు. స్థానికంగా ఏర్పడిన ఈ నమ్మక సంబంధం కొనసాగాలంటే చిన్న, మధ్య తరహా వ్యాపారులు బలపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక ప్రజలు తమ అవసరాలకు వీలైనంత వరకు పట్టణంలోని స్థానిక దుకాణాలనే ఆశ్రయించాలని రాచమల్లు సూచించారు. స్థానిక వ్యాపారులు అభివృద్ధి చెందితే పట్టణంలోనే డబ్బు చలామణి అవుతుందని, దాంతో అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.
చిన్న, మధ్య తరహా వ్యాపారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ముందడుగు వేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. కార్పొరేట్ సంస్థల పోటీ నుంచి స్థానిక వ్యాపారులను కాపాడేలా ప్రత్యేక చర్యలు, రక్షణాత్మక విధానాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపార వ్యవస్థ బలపడితేనే పట్టణ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా నిలబడగలదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.













