రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కడప
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, RTC బస్టాండ్ వద్ద రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అఫ్రార్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి గల కారణాలు, బైకులు ఏ దిశ నుంచి వచ్చాయన్న అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో RTC బస్టాండ్ పరిసర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.













