ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నకిలీ డ్వాక్రా గ్రూపుల పేరిట కోట్ల రూపాయల రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, కొందరు ఆర్పీలు, అధికారులు కలిసి నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న మేరువ శారద అనే మహిళకు యూనియన్ బ్యాంకు నుండి లీగల్ నోటీసులు రావడంతో ఈ మోసం బహిర్గతమైంది. ఆమె ఎలాంటి రుణం తీసుకోకపోయినా, వసంతపేట శాంభవి గ్రూపు పేరిట ₹10 లక్షల అప్పు ఉందని నోటీసులో పేర్కొనడం ఆమెను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

ఈ నేపథ్యంలో శారద బ్యాంకు అధికారులను సంప్రదించగా, సంబంధిత రుణాన్ని ఆర్పీలే డ్రా చేసినట్లు సమాచారం తెలిసినట్టు బాధితుల వర్గాలు చెబుతున్నాయి. ఒక్క శారద కేసు మాత్రమే కాకుండా, ప్రొద్దుటూరులోని 3, 14, 15, 25, 26, 27, 28, 29 వార్డులలో దాదాపు 45 నుంచి 50 నకిలీ డ్వాక్రా గ్రూపులను సృష్టించి ఇదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

గత YSR కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో మెప్మాలోని ఒక ఉన్నతాధికారితో పాటు మరికొందరు ఆర్పీలు కలిసి లక్ష్యాలు పెట్టుకుని ఈ నకిలీ గ్రూపులను ఏర్పాటు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో కొందరు ఆర్పీలు వ్యక్తిగతంగా ఆస్తులు, బంగారం కొనుగోలు చేశారని, ఇప్పుడు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు అసలు గ్రూపు సభ్యుల పేర్లకే లీగల్ నోటీసులు జారీ చేస్తున్నాయని వారు వాపోతున్నారు.

ఈ పరిణామాలతో బాధిత మహిళలు, డ్వాక్రా సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే పేర్లను వినియోగించి రుణాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు తమపై కేసులు, వసూళ్ల భయం కమ్మేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ గ్రూపులను గుర్తించి, అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై మెప్మా DPM హరిప్రసాద్ రెడ్డి స్పందించారు. నకిలీ గ్రూపుల అంశం ఇప్పటివరకు తన దృష్టికి రాలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడతామని సంబంధిత వర్గాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రొద్దుటూరులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మెప్మా పర్యవేక్షణ, డ్వాక్రా రుణాల మంజూరు విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం అధికారుల తలుపులు తట్టుతుండగా, సంబంధిత శాఖలు ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా విచారణ జరుపుతాయన్నది ఆసక్తిగా మారింది.