రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రొద్దుటూరు బంగారు వ్యాపారాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో జరిగిన గోల్డ్ స్మిత్ , జ్యువలరీ అసోసియేషన్స్ విస్తృత సమావేశంలో స్థానిక బంగారు వ్యాపారాల సమస్యలు, సవాళ్లు ప్రధానాంశంగా చర్చకు వచ్చాయి. తరతరాలుగా ప్రొద్దుటూరు గుర్తింపుగా నిలిచిన స్థానిక బంగారు వ్యాపారం, స్వర్ణకారుల జీవనోపాధిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సమావేశంలో స్పష్టం చేయబడింది.
కార్పొరేట్ కంపెనీల పోటీలో స్థానిక వ్యాపారులు, వర్కర్లు నష్టపోకుండా తమవంతు సహకారం నిరంతరం కొనసాగిస్తామని ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక వ్యాపారుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తాను కట్టుబడి ఉంటానని, ఈ విషయంలో శ్రీఅమ్మవారి సాక్షిగా తన నిబద్ధతను తెలియజేశారు.

శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధ్యక్షతన బంగారు వ్యాపారులు, గుమస్తాలు, నగల తయారీ కార్మికులతో ప్రత్యేక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వ్యాపారులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసోసియేషన్స్ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ వ్యాపారాలు, బహుళజాతి కార్పొరేట్ కంపెనీల రాకతో స్థానిక బంగారు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జ్యువలరీ అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పర్తి మధుసూదన్ వివరించారు. కార్పొరేట్ సంస్థల దాడి వల్ల సంప్రదాయ బంగారు దుకాణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , కంప్యూటర్ దెసిగ్నింగ్ సాంకేతికత వేగంగా విస్తరించడంతో చేతివృత్తినే ఆధారంగా పెట్టుకుని జీవిస్తున్న బంగారు నగల తయారీ కార్మికులకు ఉపాధి కరువైందని గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాల ఆధారిత డిజైనింగ్, తయారీ పెరగడంతో చేతిపని విలువ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్కృతి వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడం, వారికి ప్రజాప్రతినిధుల మద్దతు అందించడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాపారులు, కార్మికులు వివరించిన ప్రతి సమస్యపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సానుకూలంగా స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. స్థానిక బంగారు వ్యాపారుల అభివృద్ధి, స్వర్ణకారుల సంక్షేమం కోసం అసోసియేషన్స్ తో సమన్వయం కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జ్యువలరీ , గోల్డ్ స్మిత్ అసోసియేషన్స్ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్ద సంఖ్యలో గుమస్తాలు, నగల తయారీ కార్మికులు పాల్గొన్నారు. స్థానిక బంగారు వ్యాపారాల భవిష్యత్తు, కార్మికుల ఉపాధి రక్షణపై ఈ సమావేశం కీలక చర్చలకు వేదికైంది.













