రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రొద్దుటూరు వ్యాపారులకు కార్పొరేట్ సంస్థలతో ఇబ్బందులు: రాచమల్లు
ప్రొద్దుటూరు: స్థానిక వ్యాపారుల సమస్యలపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. గురువారం దొరసానిపల్లె లోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రొద్దుటూరు ఏర్పాటైన నాటి నుండి వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టణమని, వస్త్ర, బంగారు, కాటన్, ఆయిల్ వ్యాపారాలతో పాటు సినిమా రంగానికి కూడా ఇక్కడి వ్యాపారులు ఆర్థిక సహాయం అందించే స్థాయిలో ఎదిగారని గుర్తుచేశారు.
అయితే ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశం కారణంగా స్థానిక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పండుగల సమయంలో దూర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ఆకర్షణీయ ఆఫర్లతో వ్యాపారం చేయడం వల్ల స్థానిక వ్యాపారులకు అమ్మకాలు తగ్గుతున్నాయని వివరించారు. స్థానిక వ్యాపారులు భారీ పెట్టుబడులు పెట్టి ప్రజలకు అరువు, గ్యారంటీ, రీప్లేస్మెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తూ సహకారం అందిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల వారికి నష్టం తప్పదని చెప్పారు.
సిఎంఆర్ వంటి షాపింగ్ మాల్ ప్రారంభంలో మంచి స్టాక్, ఆఫర్లతో ప్రారంభమైందని, ప్రస్తుతం డెడ్ స్టాక్ పెట్టుతున్నారని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలా షాపింగ్ మాల్ లో వ్యాపారం తగ్గితే అక్కడ ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వస్తుందని, చివరికి నష్టం స్థానికులకే అవుతుందని వ్యాఖ్యానించారు.
చందనాస్ అనే సంస్థ ప్రొద్దుటూరులో ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, పట్టణంలో బంగారు వర్తకులు, కార్మికులు కలిపి దాదాపు 5–6 వేల మంది ఉన్నారని, స్థానిక దుకాణాల్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తున్నాయని చెప్పారు. చందనాస్ షోరూం మాత్రం ధనవంతులకే పరిమితమైపోతుందని, స్థానిక వ్యాపారులు ప్రజలకు అరువు, రీప్లేస్మెంట్ ఇస్తున్నా, కార్పొరేట్ షోరూం లలో అలాంటి సదుపాయం లేదని తెలిపారు.
నాయీబ్రాహ్మణులు తమ శక్తి మేరకు షాపులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారని, ఇలాంటి సమయంలో బయట ప్రాంతాల నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చి నాయీబ్రాహ్మణేతరులకు కూడా ఉపాధి కల్పిస్తే, వారు ఆ వృత్తిని సక్రమంగా నిర్వహించగలరా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. త్వరలో ఎలక్ట్రికల్, స్టీల్ సామాన్ల కార్పొరేట్ సంస్థ కూడా రావచ్చని సమాచారం ఉందని చెప్పారు.
స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కార్పొరేట్ సంస్థల వారు ఇక్కడ వ్యాపారం చేసి మన డబ్బుతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారని, స్థానిక వ్యాపారులను ప్రోత్సహిస్తే ప్రొద్దుటూరు ధనవంత పట్టణంగా మారుతుందని, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తే ఆర్థిక వలస విధానానికి మద్దతు ఇచ్చినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ సంస్థల యజమానులు ఇక్కడ ఏమీ కొనరని, ప్రొద్దుటూరులో నివసించరని, వారి వల్ల పట్టణానికి ప్రత్యక్ష ఆదాయం ఉండదని పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలన కాలంలో మహాత్మా గాంధీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, స్థానిక వర్తకులు, రైతులు, నేతలను ప్రోత్సహిస్తే ప్రాంతం ఆర్థికంగా బలపడుతుందని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపై ఆలోచించాలని సూచించారు.
తాను అధికారంలో ఉన్న సమయంలో ఇతర ప్రాంతాల వ్యాపారులను ప్రోత్సహించలేదని, D Mart తో పోలిస్తే స్థానిక వ్యాపారులు అదే ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని చెప్పారు. D Mart కేవలం రెడీ టూ ఈట్ వస్తువులు కొనేవారికే ఉపయోగకరమని, సాధారణ ప్రజలకు కార్పొరేట్ సంస్థల వల్ల ప్రయోజనం లేదని, అందుకే స్థానిక వ్యాపారులనే ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాము స్థానిక వ్యాపారులకు ఇచ్చిన మద్దతు తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు.













