రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాయలసీమకు శ్రీశైలం జలాశయం ద్వారా సాగునీరు అందించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదని తెలుగు దేశం పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ రైతులు, ముఖ్యంగా KC కెనాల్ పరిధిలో ఉన్న రైతులు నీటి ఆశలు పెట్టుకుని పంటల సాగు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి కంటే విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో మిగిలి ఉన్న నీటిని కూడా నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న నేపథ్యంలో రాయలసీమకు నీటి అవకాశాలు మరింత తగ్గిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీశైలంలో నీటి మట్టం ఉన్నంత మాత్రాన రాయలసీమకు తప్పనిసరిగా నీళ్లు వస్తాయనే భావన రైతులు పెట్టుకోవద్దని వరదరాజులురెడ్డి సూచించారు. ప్రభుత్వానికి KC కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయాలనే ఆలోచన ఇప్పటికీ లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశాలు కనిపించడం లేదని ఆయన వివరించారు.
నేను అధికారులు, మంత్రులతో మాట్లాడా.. వాళ్లు సాగునీరు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు
ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతులు వరి పంటల సాగు చేయడం ప్రమాదకరమని ఎమ్మెల్యే హెచ్చరించారు. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా వరి పంటలు వేస్తే భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని ఆయన సూచించారు.
రైతులు వరి పంటలు వేయవద్దు... అరుతడి పంటలు కూడా వర్షాలొస్తే వేసుకోండి
ప్రస్తుత నీటి పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని రైతులు తమ పంటల ప్రణాళికలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వరదరాజులురెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు సాగునీరు అందుతుందనే అంచనాలపై ఆధారపడకుండా, వర్షాలపై ఆధారపడి సాగు చేయగల పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్టాలను తప్పించుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పునరుద్ఘాటించారు.













