రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని, షాపింగ్ మాల్స్ ఏర్పాటుకు తాను పూర్తిగా వ్యతిరేకమని టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ డాక్టర్ జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
స్థానిక వ్యాపారులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వ్యక్తిగతంగా కూడా వారి సమస్యలకు తన మద్దతు ఉంటుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో CMR షాపింగ్ మాల్ , Dmart, రిలయన్స్ మార్ట్ వంటి వాణిజ్య సంస్థలకు గతంలో అనుమతులు ఎవరి హయాంలో లభించాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
స్థానిక వస్త్ర వ్యాపారులు వ్యతిరేకించినప్పటికీ ఆయా అనుమతులు ఇచ్చారని, ఈ విషయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. వ్యాపారుల ఓట్ల కోసమే ప్రస్తుతం మాల్స్ అంశాన్ని రాజకీయంగా ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.
కరోనా సమయంలోనూ వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి దుకాణాలు తెరవడానికి అనుమతులు ఇచ్చారంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. SS మాల్ విషయంలో ఒకసారి అనుమతులు ఇచ్చి, అనంతరం దానికి తనకు సంబంధం లేదని చెప్పడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచించారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలపై మాట్లాడుతున్న రాచమల్లు, తానే గతంలో ఒక సెలూన్‌ను ప్రారంభించిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రారంభమైన పలు దుకాణాలు ప్రస్తుతం మూతపడిన విషయాన్ని కూడా పరిశీలించుకోవాలని అన్నారు.
భారతి సిమెంట్ పరిశ్రమలో స్థానికులు, స్థానికేతరులకు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో కలిసి పరిశీలిద్దామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. అక్కడ స్థానికేతరులే అధికంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రొద్దుటూరులో భవిష్యత్తులో కొత్త షాపింగ్ మాల్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని అడ్డుకునేందుకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక వ్యాపారులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.













