ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉంటామని ప్రొద్దుటూరు నియోజకవర్గం Congress పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరు స్వశక్తి భవన్‌లో STF ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధిల్ల సుబ్బరాజు యాదవ్ ఆధ్వర్యం వహించారు. సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సంఘం ప్రతినిధులు వివరంగా ఇర్ఫాన్ బాషాకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అమలవుతున్న వేతన విధానాలు, భత్యాల బకాయిలు, TET నిబంధనలపై ఇర్ఫాన్ బాషా తీవ్రంగా స్పందించారు. 2018లో అమలులోకి వచ్చిన 11వ PRC తర్వాత ఇప్పటివరకు 12వ PRC ఏర్పాటు చేయకపోవడం, ఐదు DAలు పెండింగ్‌లో ఉంచడం ఉద్యోగులపై తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

“2018లో 11వ PRC తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా 12వ PRC ఏర్పాటు చేయకపోవడం, ఐదు DAలు పెండింగ్‌లో ఉంచడం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం. ఈ కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకులు, పెట్రోల్, ప్రయాణ ఖర్చులు తదితరాల ధరలు భారీగా పెరిగినా జీతాల్లో తగిన మార్పు లేకపోవడం దారుణం” అని ఇర్ఫాన్ బాషా అన్నారు.

దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం అమలు చేస్తున్న TET నిబంధనలను ఆయన ప్రశ్నించారు. 15–20 ఏళ్లుగా బోధిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ TET పరీక్ష రాసి తమ అర్హతను నిరూపించుకోమనడం ఎంతవరకు సమంజసం అని ఆయన వ్యాఖ్యానించారు.

“ఒక పరీక్ష పాస్ కావచ్చు.. కానీ 15 ఏళ్ల, 20 ఏళ్ల అనుభవాన్ని ఏ పరీక్షా భర్తీ చేయలేదు” అని ఇర్ఫాన్ బాషా అన్నారు.

కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. DAలను సకాలంలో మంజూరు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న DAలను కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలను APCC అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి లేఖ, ప్రాతినిధ్యం అందిస్తానని ఇర్ఫాన్ బాషా తెలిపారు. అవసరమైతే కేంద్ర స్థాయిలో కూడా ఈ సమస్యలను వినిపించడంతో పాటు, న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

“ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటాను. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధం” అని ఇర్ఫాన్ బాషా భరోసా ఇచ్చారు.

సమావేశంలో STF ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సంఘం చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.