రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంగా ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆకలి బాధలతో అలమటించే పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపు తప్పి సామాన్యుల జీవనాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు.
బియ్యం, కందిపప్పు, చక్కెర, చింతపండు, మిర్చి, కొబ్బరి వంటి రోజువారీ అవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సాధారణ కుటుంబాలు గడవడం కష్టసాధ్యమైందని రాచమల్లు పేర్కొన్నారు. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఎగబాకి, మరోవైపు రాష్ట్ర అప్పుల భారం తారస్థాయికి చేరినా, అన్నదాతలు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన ఈ పరిస్థితులేనా చంద్రబాబు విజనరీ పాలన ఫలితమని రాచమల్లు ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధరల నియంత్రణపై ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.
నిత్యావసరాల ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాచమల్లు తెలిపారు. ధరల నియంత్రణ, రైతులకు గిట్టుబాటు ధర, సామాన్యుల జీవన భద్రత కోసం పార్టీ బలమైన పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని రాచమల్లు హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరులో కార్పొరేట్ వ్యాపార సంస్థల విస్తరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భారీ కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల చిరు వ్యాపారులు, స్థానిక వర్తకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
కార్పొరేట్ కంపెనీలు వస్తే తప్పేంటని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని రాచమల్లు మండిపడ్డారు. ప్రజల, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే విధమైన వ్యాఖ్యలు అనర్హమని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్పొరేట్ సంస్థలు వెంటనే ప్రొద్దుటూరు నుంచి వెనుదిరగాలని, లేనిపక్షంలో స్థానిక వ్యాపారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని రాచమల్లు హెచ్చరించారు. ప్రజల, రైతుల, చిన్న వ్యాపారుల హక్కుల కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.













