కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలక మలుపుగా మారనున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్‌గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఈసారి కూడా అమలు చేయాలని Telugu Desam Party సిద్ధమవుతోంది. పులివెందుల మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు వెలువడిన విషయం తెలిసిందే. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అంగీకరించబోమని, అలాంటి చోట్ల ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కట్ చేస్తానని వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ సొంత పార్టీ నేతలకు ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవాలు జరగకుండా చూడడం అవినాష్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది.

గత పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పక్షం వేసిన వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టడంలో అవినాష్ రెడ్డి విఫలమయ్యారనే అసంతృప్తి వైఎస్ జగన్‌లో ఇంకా ఉన్నట్టుగా పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అవినాష్ రెడ్డి భుజాలపై పడింది.

నామినేషన్ల దశ నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి అండగా నిలవడం, అవసరమైన చోట ఆర్థిక సహకారం అందించడం, స్థానిక స్థాయిలో సమన్వయం కల్పించడం వంటి పనులన్నీ అవినాష్ రెడ్డి చూసుకోవాల్సి వస్తోంది. ఈ భారీ బాధ్యతను ఆయన ఎంతవరకు సమర్థంగా నిర్వర్తిస్తారన్నదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ టాస్క్‌లో అవినాష్ రెడ్డి విజయవంతం కాకపోతే, పార్టీ కీలక బాధ్యతల నుంచి ఆయనను వైఎస్ జగన్ పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలున్నాయన్న టాక్ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య జోరుగా వినిపిస్తోంది. పులివెందులలో ఏకగ్రీవాలను అడ్డుకుని, జగన్ పెట్టిన ఈ చివరి పరీక్షలో నెగ్గితేనే అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు బలపడుతుందని భావిస్తున్నారు.

లేకపోతే ఆయనకు సొంత పార్టీలోనే ప్రాధాన్యం తగ్గడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలు కడప ఎంపీ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షగా మారాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.