రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పులివెందుల మండలం కదిరి రోడ్డులోని నామాలగుండు సిద్దలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగిన దొంగతనం కేసును పులివెందుల అర్బన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 138/2026, సెక్షన్ 303(2) BNS, పాత IPC కింద నమోదు అయింది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తు అమ్మకం ద్వారా వచ్చిన రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టు అయిన ముద్దాయిలు A1 గురివింటి మధు కృష్ణ (వయసు 37 సంవత్సరాలు, తండ్రి బాలరాజు, ఎరుకల ఎర్రగుడి పాలెం, పులివెందుల టౌన్), A2 కందుకూరి వెంకట శివయ్య (వయసు 43 సంవత్సరాలు, తండ్రి మహానంది, ఎరుకల ఎర్రగుడి పాలెం, పులివెందుల మండలం) గా గుర్తించారు. వీరు నామాలగుండు సిద్దలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగిన దొంగతనం కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ముద్దాయిల అరెస్టు వివరాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీరామ్, ఎస్సై, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు ముద్దాయిలను రిమాండ్‌కు పంపించే ప్రక్రియలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 139, 141/2026, సెక్షన్ 303(2) BNS, పాత IPC 379 కింద నమోదు చేసిన రెండు మోటార్ సైకిల్ దొంగతనం కేసులను కూడా పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ముద్దాయిగా ఉన్న భూపతి మధు (వయసు 27 సంవత్సరాలు, తండ్రి శ్రీనివాసులు, కులం దొమ్మర, నెహ్రూ రోడ్డు, ప్రొద్దుటూరు టౌన్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూపతి మధు వద్ద నుంచి మొత్తం 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న మోటార్ సైకిల్ దొంగతనాల వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు విచారణను మరింత విస్తరించినట్లు పోలీసు వర్గాలు సూచించాయి.
దొంగతనం కేసులు వరుసగా నమోదు అవుతున్న నేపథ్యంలో, దేవాలయాలు, వాణిజ్య సంస్థలు, నివాస గృహాలు వద్ద భద్రతా చర్యలను బలోపేతం చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పట్టుబడిన ముద్దాయిలను సంబంధిత కేసుల్లో న్యాయపరమైన చర్యలకు గురి చేయనున్నట్లు తెలిపారు.













