పులివెందుల:- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పులివెందుల సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఆదేశాల మేరకు పులివెందుల సబ్‌ డివిజనల్ పోలీసు అధికారి బుక్కే మురళి, DSP ప్రత్యక్ష పర్యవేక్షణలో బుధవారం పులివెందుల పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచి, ప్రజల్లో భద్రతాభావం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల కదలికలను అరికట్టేందుకు పట్టణంలోని లాడ్జీలు, డాబాలు తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను నిలిపివేసి విచారించడంతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాహనాలను వినియోగించే అవకాశాలను ముందుగానే తిప్పికొట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సబ్‌ డివిజన్‌ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో కూడా పోలీసు బలగాలతో విస్తృతంగా ఏరియా డామినేషన్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రతి సున్నిత ప్రాంతాన్ని గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా పులివెందుల DSP బుక్కే మురళి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని DSP హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేదా అవాంఛనీయ ఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించగలమని ఆయన స్పష్టం చేశారు.