రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఉదయం నుంచి ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి రాజ్ కెసిరెడ్డి నివాసాలతో పాటు మరో ఆరుగురు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. నానక్‌రామ్‌గూడలోని రాజ్ కెసిరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ మార్గాల ద్వారా నిధులు తరలించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్‌ఏ కింద అభియోగాలు నమోదు చేసి, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా ఈడీ చేర్చింది. వీరిలో రాజ్ కెసిరెడ్డి, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఏపీఎస్‌బీసీఎల్ పూర్వ ఎండీ డి.వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్య, టి.కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును రూటింగ్ చేయడానికి వినియోగించిన పలు డొల్ల కంపెనీల యాజమాన్యాలను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణాల్లో ఒకటిగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి, అంతిమ లబ్ధిదారులకు చేరవేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఏపీలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం లావాదేవీల వెనుక ఉన్న అసలు మూలాలు, నిధుల తుది గమ్యం, లబ్ధిదారులను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తును మరింత విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు, పిలుపులు ఉండే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.







