రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: భారత డైరీ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడే విధంగా పాలు, పాలు ఉత్పత్తుల సరఫరాను పెంచడం అత్యవసరమని Heritage Foods ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా పేర్కొన్నారు. పశువుల ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాలను మెరుగుపరచడం, గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ సవాల్‌ను ఎదుర్కొనగలమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (MPW) 2026 కార్యక్రమంలో ‘ రన్నింగ్ కంపెనీస్ విత్ పర్పస్ ’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్న బ్రాహ్మణి, భారత డైరీ రంగం ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుగా ఎదిగినా, పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడేంతగా సరఫరా పెరుగడం లేదని ఆమె సూచించారు.అయితే, డిమాండ్–సరఫరా మధ్య నిర్మాణాత్మక అసమతుల్యత ఏర్పడుతోందని బ్రాహ్మణి హెచ్చరించారు.
ఈ అంతరాన్ని తగ్గించాలంటే వ్యవసాయ స్థాయిలోనే ఉత్పాదకతను పెంచడం కీలకమని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత పశువుల పాల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉందని ఆమె వివరించారు. ప్రస్తుతం భారతదేశంలో పశువులు రోజుకు సగటున ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు మాత్రమే పాలు ఇస్తున్నాయని, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో కనిపించే ఉత్పాదకతలో సుమారు 20–25 శాతం మాత్రమేనని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో Heritage ఫుడ్స్ రైతులతో కలిసి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని బ్రాహ్మణి వివరించారు. సబ్సిడీతో పశుగ్రాసం, మేత అందించడం, ఆర్టిఫిషల్ ఇంసెమినషన్ కార్యక్రమాలు, పశువైద్య సేవలు, బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యాల ద్వారా సులభ రుణ సదుపాయాలు కల్పించడం వంటి చర్యల ద్వారా పశువుల ఆరోగ్యం, ఉత్పాదకతను మెరుగుపరుస్తున్నట్లు ఆమె చెప్పింది.
ప్రస్తుతం Heritage ఫుడ్స్ రోజుకు 18–19 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, సుమారు 6,000 గ్రామాల నెట్‌వర్క్ ద్వారా ఈ సేకరణ జరుగుతోందని బ్రాహ్మణి తెలిపారు. 35 ఏళ్ల క్రితం రోజుకు 20,000 లీటర్ల పాలు సేకరణతో ప్రారంభమైన వ్యాపారం ఇంత పెద్ద స్థాయికి చేరిందని ఆమె గుర్తుచేశారు.
విలువ ఆధారిత ఉత్పత్తులే వృద్ధికి ఇంధనం
రైతు కేంద్రిత సేకరణ విధానంతో Heritage ఫుడ్స్ విలువ ఆధారిత పాలు ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించగలిగిందని బ్రాహ్మణి పేర్కొన్నారు.
భారతదేశంలో “ ది మోస్ట్ admired డైరీ న్యూట్రిషన్ కంపెనీ ”గా ఎదగడం సంస్థ దీర్ఘకాల లక్ష్యమని, అదే సమయంలో సాంకేతికత, మెరుగైన పశు నిర్వహణ, మెరుగైన మార్కెట్ ప్రాప్యత ద్వారా రైతుల ఆదాయాలను రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు.
భారతదేశం కొత్త వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న నేపథ్యంలో విదేశీ డైరీ బ్రాండ్ల పోటీపై స్పందించిన బ్రాహ్మణి, ప్రస్తుతం పరిశ్రమ ప్రధాన ప్రాధాన్యత దేశీయ పాల ఉత్పత్తిని బలోపేతం చేయడమే కావాలని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలంటే ప్రైవేట్ రంగం, రైతులు, ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (MPW) 2026 కార్యక్రమం 16వ ఎడిషన్‌గా ఈసారి జరిగింది. వ్యాపారం, ప్రజా విధానం, ఆంత్రప్రెన్యూర్షిప్, ఆరోగ్యం, తయారీ, వినోద రంగాల్లో ప్రభావవంతమైన భారత మహిళలను ఈ వేదికలో సత్కరించారు. RPSG గ్రూప్ వైస్ చైర్మన్ Shashwat Goenka ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, పలు రంగాల్లో పరిశ్రమలను మారుస్తూ, అనేక బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న మహిళలకు ఘన నివాళి అర్పించారు.







