నరసరావుపేట: మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత నెల 14న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ వీఎస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా తొలుత చిన్నమల్లయ్య తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు, పిటిషనర్‌ మధ్య పరస్పర అంగీకార పూర్వక సంబంధాలున్నాయని ఆయన ధర్మాసనానికి వివరించారు. అయితే, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఆ వాదనలతో ఏకీభవించలేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

దీనికి ప్రతిస్పందించిన చిన్నమల్లయ్య తరఫు న్యాయవాది, వారిద్దరి మధ్య పరస్పర అంగీకారానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. వారిమధ్య జరిగిన వాట్సప్‌ కాల్స్‌, నగదు లావాదేవీల వివరాలను పిటిషన్‌తో పాటు జతచేశామని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ, పరస్పర అంగీకార పూర్వకమైన సంబంధాలున్నప్పటికీ సీఐకి వ్యతిరేకంగా ఆమె తప్పుడు కేసు పెట్టారని ధర్మాసనానికి వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా, హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

విధుల నుంచి తొలగింపు

ఇదిలా ఉండగా, సీఐ చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని ఓ గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 29న వినుకొండ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా అతణ్ని విధుల నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.