విశాఖలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమం

నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారానే రాష్ట్రం పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలదని, ఇందుకోసం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లు రిసార్ట్ లో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ (Digii100x ANDHRA PRADESH) సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సదస్సులో వికసిత్ భారత్ నిర్మాణం, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పాత్ర, యువతకు అవకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మానవ వనరులపై పెట్టుబడి పెడితేనే సుసంపన్న భవిష్యత్ సాధ్యమని, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక విధానాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కార్యక్రమంలో తెలియజేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

స్పీడ్ బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వంటి ఎపి సర్కార్ అంశాల సమ్మిళిత ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పై పెట్టుబడిదారుల దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోందని, రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు విస్తృత స్థాయిలో అవకాశాలు లభిస్తాయని వారు అన్నారు. యువతకు అవకాశాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ తో భాగస్వాములు కావాలని, రాష్ట్ర అభివృద్ధి యాత్రలో పరిశ్రమలు, స్టార్టప్ లు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సదస్సులో పిలుపునిచ్చారు. డిజిటల్ రంగం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ వంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.