భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ తన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరికోటలో ఏర్పాట్లు వేగవంతం చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహణలో ఉన్న సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌పై స్కైరూట్‌ రూపొందించిన విక్రమ్‌-1 రాకెట్‌ మొదటి దశను విజయవంతంగా అమర్చింది.

ఇది దేశంలోనే తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌గా గుర్తింపు పొందబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా ఇస్రో రూపొందించిన రాకెట్లకే షార్‌లో ప్రయోగ వేదికలు లభించగా, ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన రాకెట్‌ను ఇస్రో ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌పై అమర్చడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ఇది మైలురాయిగా భావిస్తున్నారు.

విక్రమ్‌-1 రాకెట్‌ అసెంబ్లింగ్‌ ప్రక్రియను దశలవారీగా కొనసాగిస్తున్నట్లు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తెలిపింది. ఒక్కో భాగాన్ని విడివిడిగా లాంచ్‌ ప్యాడ్‌పై అమర్చుతూ, మొత్తం రాకెట్‌ రూపుదిద్దుకునేలా పనులు జరుగుతున్నాయని సంస్థ పేర్కొంది. ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా అమర్చి, ప్రయోగానికి సిద్ధంగా ఉంచుతున్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను స్కైరూట్‌ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో పంచుకుంది.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కొన్ని రోజుల్లో విక్రమ్‌-1 రాకెట్‌తో తన తొలి కక్ష్య ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చిన్న ఉపగ్రహాల ప్రయోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తక్కువ ఖర్చుతో, వేగంగా ప్రయోగాలు నిర్వహించగల సామర్థ్యాన్ని విక్రమ్‌-1కు కల్పించినట్లు సంస్థ ముందుగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇస్రో లాంచ్‌ ప్యాడ్‌ వినియోగానికి అనుమతి లభించడం, అక్కడే రాకెట్‌ దశలను అమర్చడం ద్వారా స్కైరూట్‌ ప్రయోగానికి మరింత చేరువైంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగాన్ని విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. విక్రమ్‌-1 తొలి కక్ష్య ప్రయోగం విజయవంతమైతే, దేశీయంగా ప్రైవేట్‌ రాకెట్‌ సేవల విస్తరణకు ఇది దారితీసే అవకాశం ఉందని అంతరిక్ష రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.