అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి:

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయాణం ప్రారంభించి చరిత్ర సృష్టించింది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఇన్-స్పేస్ సహకారంతో శుక్రవారం నాడు నింగిలోకి ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ అంతరిక్ష రంగంలో కొత్త దశలోకి అడుగుపెట్టినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చారిత్రాత్మక ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపే దిశలో సరికొత్త మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను తెరిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ బృందాలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి కృషి, నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం వల్లే ఈ మిషన్ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

“ప్రతి తరం తాము దాటడానికి సాహసించిన సరిహద్దుల ద్వారానే గుర్తుండిపోతుంది. నేడు భారతదేశం అంతరిక్ష రంగంలో అటువంటి సరికొత్త సరిహద్దును చేరుకుంది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరిచి, నూతన ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విప్లవాత్మక దార్శనికతకు ఈ మిషన్ ఒక నిదర్శనం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ మిషన్ కేవలం రాకెట్ ప్రయోగం మాత్రమే కాదని, భారతీయ ప్రతిభ, శాస్త్రీయ నైపుణ్యం, పారిశ్రామిక స్ఫూర్తి, సాహసోపేత ఆలోచనలను చారిత్రాత్మక విజయాలుగా మార్చగల ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ధైర్యం, ఆవిష్కరణ, పట్టుదల ఉంటే భారతీయులకు ఏ సరిహద్దు కూడా అసాధ్యం కాదనే శక్తివంతమైన సందేశాన్ని ఈ విజయం యువతకు అందించిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టం రాబోయే తరాలకు పెద్ద కలలు కనేందుకు, సరికొత్త ఆవిష్కరణలు చేయేందుకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలు దేశ ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధికి మరింత బలాన్నిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.