అమెరికా కృత్రిమ మేధ దిగ్గజం ఓపెన్‌ఏఐ భారత కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (ఎండీ) ప్రభ్‌జీత్‌ సింగ్‌ను నియమించింది. వేగంగా విస్తరిస్తున్న భారత ఏఐ మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకోవాలన్న లక్ష్యంతో ఓపెన్‌ఏఐ ఈ నియామకాన్ని చేపట్టింది.

సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న ప్రభ్‌జీత్‌ సింగ్‌ భారతదేశంలో ఓపెన్‌ఏఐ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షిస్తారు. వినియోగదారుల వృద్ధి, కంపెనీల ద్వారా ఏఐ సేవల వినియోగం (అడాప్షన్‌), భాగస్వామ్యాలు, నియంత్రణ సంస్థలతో సమన్వయం వంటి విభాగాలు ఆయన పరిధిలో ఉంటాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఎండీగా ఉన్న కిరణ్‌ మణికి ప్రభ్‌జీత్‌ సింగ్‌ నివేదించాల్సి ఉంటుంది.

ఓపెన్‌ఏఐ 2025లో దిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత మార్కెట్‌ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా తమ వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ తమకు కీలక మార్కెట్‌ అని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తరచూ పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే.

ప్రభ్‌జీత్‌ సింగ్‌ గతంలో ప్రముఖ రైడ్‌షేరింగ్‌ సంస్థ ఉబర్‌లో 11 ఏళ్లపాటు పనిచేశారు. ఇటీవలి వరకు ఉబర్‌ కంపెనీకి భారత్‌, దక్షిణాసియా ప్రాంత ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ నుంచి విద్యను పూర్తిచేసిన ఆయన, ఉబర్‌కు చేరకముందు మెకిన్సే అండ్‌ కంపెనీలోనూ కీలక బాధ్యతలు చేపట్టారు.

కార్పొరేట్‌ రంగంలో తన సేవలకు గుర్తింపుగా ప్రభ్‌జీత్‌ సింగ్‌కు 2022లో ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ నుంచి యంగ్‌ అలమ్నై అచీవర్స్‌ అవార్డు లభించింది. వ్యూహాత్మక ప్రణాళిక, వ్యాపార విస్తరణ, నియంత్రణ వ్యవస్థలతో పని చేసే అనుభవం ఆయనకు ఉన్నందున, ఓపెన్‌ఏఐ భారత కార్యకలాపాల విస్తరణకు ఈ నియామకం తోడ్పడనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కృత్రిమ మేధ రంగంలో భారత్‌ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో, స్థానిక భాగస్వామ్యాలు, ప్రభుత్వ విధానాలు, నియంత్రణ వ్యవస్థలతో సమన్వయం కీలకమవుతోంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ తీసుకున్న తాజా నిర్ణయం, దేశీయ ఏఐ ఎకోసిస్టమ్‌లో కంపెనీ పాత్రను మరింతగా పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.