రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అభిరథ్ రెడ్డి నాయకత్వంలోని ఈ జట్టు ఇప్పటివరకు రెండు వరుస మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి జోరుమీదుంది. శనివారం మెదక్ ఫాల్కన్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.
టోర్నీలో తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో అదరగొట్టిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటింది. పాలమూరు స్ట్రైకర్స్‌పై బౌలర్లు అజయ్‌దేవ్ గౌడ్, యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అనంతరం అన్విత్ రెడ్డి, గణేశ్ గడుగు బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.
రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ సాధారణ స్థాయిలో సాగినప్పటికీ బ్యాటింగ్‌లో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (99 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు నమోదు చేయడంతో పాయింట్ల పట్టికలో ఈ ఛాంపియన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఓపెనర్ సాయివికాస్ రెడ్డి మంచి ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్ విభాగంలో జట్టుకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే గత మ్యాచ్‌లో విఫలమైన అజయ్‌దేవ్ గౌడ్ తిరిగి లయ అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణవ్ వర్మ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు బలంగా మారాడు.
అయితే టాప్ ఆర్డర్ విఫలమైతే లోయర్ ఆర్డర్ ఎలా స్పందిస్తుందన్నది ఈ ఛాంపియన్స్‌కు ప్రధాన ప్రశ్నగా మారింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించిన స్పిన్ ఆల్‌రౌండర్ యశ్వీర్ గౌడ్ భారత్ అండర్-19 జట్టుకు ఎంపిక కావడంతో ఇక టీజీ20లో ఈ ఛాంపియన్స్‌కు అందుబాటులో ఉండడు. శ్రీలంకతో సిరీస్ కోసం అతడు ఇప్పటికే బయలుదేరాడు.
మరోవైపు మెదక్ ఫాల్కన్స్ టోర్నీని శుభారంభంతో మొదలుపెట్టింది. తిలక్ అజేయ శతకంతో మెదక్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే అతడు జట్టును వీడిన తర్వాత మెదక్ ఫాల్కన్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
రవితేజ నేతృత్వంలోని మెదక్ ఫాల్కన్స్ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో తరచూ తడబడుతోంది. విక్రమ్ నాయక్, నమన్ అగర్వాల్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్న ఈ జట్టు, మధ్యతరగతి మరియు లోయర్ ఆర్డర్ నుంచి తగిన మద్దతు పొందడంలో విఫలమవుతోంది.
జోరుమీదున్న ఈ ఛాంపియన్స్‌ను నిలువరించడం మెదక్ ఫాల్కన్స్‌కు పెద్ద సవాలుగా మారింది. హ్యాట్రిక్ విజయంపై దృష్టి పెట్టిన హైదరాబాద్ జట్టును ఆపేందుకు మెదక్ బ్యాటింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. శనివారం జరగనున్న ఈ పోరు టీజీ20 లీగ్‌లో కీలక మ్యాచ్‌గా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







