సూర్యకుమార్ కెప్టెన్సీ తొలగింపు వార్తలపై కైఫ్ స్పందన

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సూర్యకుమార్‌ను తొలగించి, అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) తీసుకోబోతున్న నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే వార్తలు తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని ఆయన పేర్కొన్నారు.

అయితే 2024 టీ20 వరల్డ్‌కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ను భారత్‌కు అందించిన రోహిత్ శర్మను వన్ డే ఇంటర్నేషనల్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు మాత్రం తాను షాక్‌కు గురయ్యానని కైఫ్ తెలిపారు. రోహిత్‌తో పోలిస్తే సూర్యకుమార్‌పై తీసుకునే నిర్ణయం అంత పెద్దది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత టీమిండియా టీ20 పగ్గాలు సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలో భారత్ మంచి విజయాలు సాధించింది. సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఏ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఆసియ కప్ , టీ20 వరల్డ్‌కప్ వంటి ప్రధాన టోర్నీలను కూడా గెలుచుకుంది.

అయితే బ్యాటర్‌గా మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేడు. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వ్యక్తిగత పరుగులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే అతని కెప్టెన్సీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకుమార్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మొహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్‌గా అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించారు. సూర్యకుమార్ భవిష్యత్తుపై తుది నిర్ణయం కోసం ఇప్పుడు అందరి దృష్టి BCCI, సెలెక్టర్ల వైపే నిలిచింది.