రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత జట్టు భారీ తేడాతో ఓడిపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమిగా నమోదవడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 201/7 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఇంగ్లాండ్ పేసర్ల దాటికి తట్టుకోలేక కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటింగ్ లైనప్ ఇలా పేకమేడలా కూలిపోవడంపై కుంబ్లే కఠిన వ్యాఖ్యలు చేశారు.
“ఇది భారత జట్టు పూర్తిగా లొంగిపోవడమే (Abject Surrender). ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశారు. నిలకడగా 145 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో షార్ట్ పిచ్ బంతులు వేస్తూ భారత బ్యాటర్లను ఊపిరి సలపకుండా చేశారు. మన బ్యాటర్లు కనీసం షాట్లు ఆడటానికి కూడా వీల్లేకుండా ఒత్తిడి పెంచారు” అని కుంబ్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న జట్టు ఇంత సులభంగా చేతులెత్తేస్తుందని ఎవరూ ఊహించరని ఆయన వ్యాఖ్యానించారు. రన్ రేట్ 10 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ పేస్ దాడిని తట్టుకుని క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాల్సిన సమయంలో ప్రతి బంతినీ బాదాలనే ఆలోచనతో వికెట్లు పారేసుకున్నారని కుంబ్లే విమర్శించారు. ఒత్తిడిని అధిగమించి కనీసం ఒక బ్యాటర్ అయినా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాల్సిందని, కానీ అందరూ దూకుడుగా ఆడబోయి ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఆహ్వానించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత జట్టు సెలెక్షన్ విధానాన్ని కూడా కుంబ్లే ప్రశ్నించారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో పదేపదే మార్పులు చేయడం ఆపాలని సూచించారు.
“బ్యాటింగ్ ఆర్డర్ దాదాపు స్థిరంగానే ఉంది. సంజు శాంసన్‌ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీని తేవడం మినహా పెద్ద మార్పుల్లేవు. కానీ బౌలర్లను మాత్రం నిరంతరం మారుస్తున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో సరిగ్గా బౌలింగ్ చేయలేదని ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ యాదవ్ రెండో టీ20లో మూడు వికెట్లు తీసి బాగానే బౌలింగ్ చేసినా భారత్ ఓడిపోయింది. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన ఐదుగురు ప్రధాన బౌలర్లపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్లు పరుగులు చేయొచ్చు.. కానీ బౌలర్లే మ్యాచ్‌లు గెలిపిస్తారు” అని కుంబ్లే స్పష్టం చేశారు.
శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపాలనే టీమిండియా నిర్ణయం పూర్తిగా విఫలమైందని కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పరిస్థితుల్లో ఎప్పుడూ స్పెషలిస్ట్ బ్యాటర్లపైనే నమ్మకం ఉంచాలని, ఆధునిక క్రికెట్‌లో 8వ నంబర్ బ్యాటర్ వచ్చి మ్యాచ్ గెలిపిస్తాడని ఆశించి, మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను వెనక్కి నెట్టడం సరైన వ్యూహం కాదని ఆయన పేర్కొన్నారు.
చివరగా, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మారడంలో భారత జట్టు విఫలమైందని కుంబ్లే విశ్లేషించారు. ఇంగ్లాండ్ బౌలర్ల ప్రణాళికలకు తగిన సమాధానం ఇవ్వడంలో బ్యాటర్లు పూర్తిగా తడబాటుకు గురయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.







