చిన్న పట్టణం నుంచి టీమ్‌ఇండియాకి.. మానవ్‌ సుతార్‌ అరంగేట్రం అదుర్స్‌

భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవడం ప్రతి క్రికెటర్‌ కల. ఎంత ప్రతిభ ఉన్నా, దిగువ స్థాయిల్లో సత్తా చాటినా సీనియర్‌ జట్టుకు చేరడం అంత తేలిక కాదు. ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలిసిరావాలి. ఈ రెండూ కలిసొచ్చిన ఆటగాడే మానవ్‌ సుతార్‌. ఎన్నోమంది స్పిన్నర్లు పోటీలో ఉన్నా, ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ భారత జట్టు తలుపు తట్టగలిగాడు. వచ్చిన తొలి అవకాశాన్ని సుతార్‌ చక్కగా వినియోగించుకున్నాడు.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో సుతార్‌ ఏడు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ దూరమవుతుండగా, రవీంద్ర జడేజా కెరీర్‌ చరమాంకానికి చేరుకున్న ఈ సమయంలో బ్యాటింగ్‌ చేయగల స్పిన్నర్‌గా 23 ఏళ్ల సుతార్‌ తాజా ప్రదర్శనతో భారత టెస్టు జట్టులో స్థిరపడేలా కనిపిస్తున్నాడు.

రాజస్థాన్‌లోని గంగానగర్‌ అనే చిన్న పట్టణం నుంచి సుతార్‌ ప్రయాణం మొదలైంది. పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ పట్టణంలోనే అతడు పెరిగాడు. సుతార్‌ తండ్రి జగదీష్‌ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు. తనయుడు క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండడంతో ఆ దిశగా ప్రోత్సహించారు. స్పిన్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సుతార్‌ ప్రతిభ చూపేవాడు.

వయో విభాగాల టోర్నీల్లో రాణించిన సుతార్‌ తర్వాత రాజస్థాన్‌ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2022-23 రంజీ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లోనే 39 వికెట్లు పడగొట్టాడు. రెండు అర్ధసెంచరీలు కూడా నమోదు చేశాడు. అదే సీజన్‌లో ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

2024 దులీప్‌ ట్రోఫీలో భారత్‌ ‘సి’ తరఫున అరంగేట్రం చేసిన సుతార్‌ భారత్‌-ఎ జట్టుపై 49 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టాడు. దులీప్‌ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఇది అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనగా నిలిచింది. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూనే వికెట్లు తీయగల నైపుణ్యం కారణంగా సుతార్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

2024 ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ సుతార్‌ను 30 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఆ సీజన్‌లో అతడు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం 2025 మెగా వేలంలో గుజరాత్‌ మళ్లీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. 2026 ఐపీఎల్‌లో సుతార్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు సాధించాడు.

తెల్ల బంతి క్రికెట్‌కంటే ఎర్ర బంతి ఫార్మాట్‌లోనే సుతార్‌ స్థిరంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 136 వికెట్లు పడగొట్టాడు. ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలు కూడా సాధించాడు. జడేజా వీడ్కోలు దశకు చేరుకున్న నేపథ్యంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కోసం వెతుకుతున్న సెలక్టర్లు సుతార్‌కు అవకాశం కల్పించారు.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో ఆడే అవకాశాన్ని సుతార్‌ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి టెస్టు అనే ఒత్తిడి అతడి బౌలింగ్‌లో కనిపించలేదు. నిలకడగా ఒకే ప్రాంతంలో బంతులు వేస్తూ బ్యాటర్లను పరీక్షించాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురిచేశాడు. క్రీజులో ఉండి బ్యాక్‌ఫుట్‌పై ఆడాలా, లేక ముందుకు వచ్చి షాట్‌ ఆడాలా అన్న సందిగ్ధంలో అఫ్గాన్‌ బ్యాటర్లు తికమకపడ్డారు.