నేడు శ్రీకారం చుట్టే మహిళల టీ20 ప్రపంచకప్‌

– భారత జట్టుపై భారీ అంచనాలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ నేడు ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఇటీవల సంవత్సరాల్లో మహిళల క్రికెట్లో భారత్‌ ప్రదర్శన గణనీయంగా మెరుగుపడినా, ప్రపంచకప్‌ పోటీల్లో ఫేవరెట్ల జాబితాలో మన జట్టును ముందువరుసలో పెట్టడంపై నిపుణుల్లో ఇప్పటికీ కొంత సందేహం కనిపిస్తోంది. గత ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను దాటి భారత్‌ టైటిల్‌ గెలుస్తుందని నమ్మినవారు పెద్దగా లేరు. అయితే సొంతగడ్డపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఆ విజయంతో ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ భారత మహిళలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న ఉమెన్‌ ఇన్‌ బ్లూ సమష్టిగా సత్తా చాటితే మరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం అసాధ్యం కాదని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీతో ప్రపంచ క్రీడాభిమానులకు రెట్టింపు వినోదం దక్కనుంది. అమెరికాలో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సంబరం మొదలైన మరుసటి రోజే ఇంగ్లాండ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కావడం విశేషం. మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో తొలి రోజు ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు శ్రీలంకను ఎదుర్కోనుంది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై నిలువరించడం చమరి ఆటపట్టు సారథ్యంలో బరిలోకి దిగుతున్న శ్రీలంకకు పెద్ద సవాలుగా మారింది.

భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. కప్పు గెలవాలన్న లక్ష్యానికి ముందుగా హర్మన్‌ప్రీత్‌ సేన సహా ప్రతి జట్టు మొదటి మెట్టు సెమీఫైనల్స్‌ చేరడమే. భారత్‌ కొంత కఠినమైన గ్రూప్‌లో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో కనీసం ఒకదాన్ని వెనక్కి నెట్టి సెమీస్‌ చేరడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

గ్రూప్‌–1లో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లకు గ్రూప్‌–2లో చోటు దక్కింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా అయిదు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

ఈసారి కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో పాటు వన్డే ప్రపంచకప్‌ విజేతగా ఎదిగిన హర్మన్‌ప్రీత్‌ సేనపై కూడా అందరి దృష్టి నిలిచింది. గత టోర్నీల గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా పేసర్‌ మెగాన్‌ షట్‌ టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా సాధించిన ఆరు టైటిళ్లలోనూ భాగమైన ఎలీస్‌ పెర్రీ ఈసారి కూడా బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.