పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు

ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రైలు స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పెద్ద మొత్తంలో ధ్వంసం అయిపోయింది.

లోపల ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. సహాయక చర్యలు మొదలెట్టారు. లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రమాదం జరిగిన సమయంలో రైలు గేట్లు తెరిచి ఉన్నాయి. బస్సు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టింది’ అని అన్నారు.