రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్, వాటర్ మెన్లకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు పత్తికొండ గ్రామపంచాయతీ ఈవోకు కార్మికుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు.
పత్తికొండ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధంగా పనిచేస్తోంది. ఈ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈవోకు వినతిపత్రం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, ఊరి పరిశుభ్రత కోసం పగలు, రాత్రి శ్రమిస్తున్నప్పటికీ, కార్మికులకు సరిపడని వేతనాలు మాత్రమే అందుతున్నాయని సంఘం నాయకులు పేర్కొన్నారు.
చాలా సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో ఎలక్ట్రిషన్, వాటర్ మెన్, పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమై, ఆకలితో అలమటించే పరిస్థితుల్లో ఉన్నారని వినతిపత్రంలో వివరించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలు ఒకే విడతలో, ఆలస్యం లేకుండా చెల్లించేలా ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు అందేలా శాశ్వత జీవో తీసుకురావాలని కోరారు.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి, ఉచిత భీమా సౌకర్యం కూడా అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నెలకు కనీసం మూడు సెలవులు ఇవ్వాలని, గ్రామపంచాయతీలో పని చేసే కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించుకునేందుకు పక్క గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై గ్రామపంచాయతీ పై అధికారులు ఇప్పటికైనా స్పందించి, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య, CPI మండల కార్యదర్శి యు.కారుమంచి, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షుడు జి.నెట్టికంఠయ్య, తాలూకా కార్యదర్శి హెచ్.రంగన్న, ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షుడు బి.మాదన్న, గ్రామపంచాయతీ కార్మికులు వచ్చురప్ప నాగేష్, రామాంజిని, అంజి, నరసింహ, పెద్ద వీరన్న, రామచంద్ర, రంగస్వామి, బాలకృష్ణ, నాగవేణి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.













