నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానం ఎదురుగా బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వరుసగా ఉన్న ఆరు దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే దుకాణాలన్నింటిని చుట్టుముట్టడంతో ప్రాంతం అంతా భయాందోళనకు గురైంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో రాత్రి కావడంతో దుకాణాలు మూసివేసి ఉండటం పెద్ద ప్రాణనష్టం తప్పించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది.

మంటలు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బాధిత దుకాణదారులు తమ దుకాణాలు కళ్ల ముందే కాలిపోతుండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో అక్కడి వాతావరణం విషాదభరితంగా మారింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవచ్చనే భయంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వాటిని అక్కడి నుండి తొలగించారు. ఈ చర్యతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం తృటిలో తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్ డ్రింక్ షాప్, రెండు హోటళ్లు పూర్తిగా కాలిపోయాయి. దుకాణాల్లో ఉన్న వస్తువులు, సామగ్రి, ఫర్నిచర్, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ మంటల్లో నాశనమయ్యాయి. ఒక్కసారిగా దుకాణాలు దగ్ధం కావడంతో తమ జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం గా ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు సంబంధిత శాఖలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి, బాధితులకు అవసరమైన సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.