రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ (NCORD) సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి, మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత క్రమశిక్షణతో ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, మాదక ద్రవ్యాల వ్యసనం వారి జీవితాలు, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల అధికారులకు సూచించారు.
తల్లిదండ్రులు నమ్మకంతో విద్యార్థులను వసతి గృహాల్లో ఉంచుతున్నందున, అక్కడ చదువుతున్న విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 30 పడకల డి అడిక్షన్ సెంటర్లో అందిస్తున్న సేవలపై సంబంధిత వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న వారి తల్లిదండ్రుల అనుభవాలను మీడియా ద్వారా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో విద్యాసంస్థలలో, వాటి పరిసరాల్లోని దుకాణాలు, పండ్ల దుకాణాల వద్ద మత్తు పదార్థాల వినియోగం జరగకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు నిఘా ఉంచి వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు సేవించినట్లు గుర్తించేందుకు అవసరమైన టెస్ట్ కిట్లను వినియోగించాలన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి కర్నూలు అడిషనల్ ఎస్పీ హుశేన్ పీరా మాట్లాడుతూ, జిల్లాలో కౌతాళం సహా కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ విషయంపై రైతులను ప్రశ్నించగా, పశువులకు వ్యాధులు రాకుండా, అవి బాగా పనిచేయడానికి వినియోగిస్తున్నామని వారు చెప్పినప్పటికీ, ఆ పంటలను ధ్వంసం చేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఇలాంటి సాగుపై వ్యవసాయ అధికారులు నిఘా ఉంచి, సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
గంజాయి వినియోగం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ కౌన్సిలింగ్ అందిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. విద్యార్థులను ప్రారంభం నుంచే సిగరెట్‌కు దూరంగా ఉంచితే, మత్తు పదార్థాలకు అలవాటు పడే అవకాశాలు తగ్గుతాయని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీమ్‌లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
అంతకుముందు జిల్లాలో డ్రగ్స్ తీసుకున్న వారిపై టెస్ట్ నిర్వహించగా నలుగురిని పాజిటివ్‌గా గుర్తించామని, వారిని వైజాగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని ఈగల్ టీం ఎస్సై రమేష్ నాయక్ కలెక్టర్‌కు వివరించారు. గంజాయి సేవించిన ఇద్దరిని కర్నూలు డి అడిక్ట్ సెంటర్‌కు పంపి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిటిసి శాంతకుమారి, డీఎంహెచ్‌వో కామేశ్వరరావు, డి ఈ ఓ సుధాకర్, ఆర్ ఐ ఓ లాలెప్ప, జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డి ఆర్డిఏ పిడి శ్రీధర్ రావు, డిసీ లేబర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్ సి అధికారి రాధిక, క్లస్టర్ యూనివర్సిటీ, కాలేజీల అధికారులు, లీగల్ టీం ఎస్సై రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.













