రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, నంద్యాల పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి రాజకుమారి గణియా IAS శుక్రవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు, అభ్యర్థులు, ప్రతినిధులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె సమీక్షించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతి అధికారి తన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించినట్లు సమాచారం.
నామినేషన్ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నియమావళి ప్రకారం అవసరమైన అన్ని సూచనలను అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆమె ఆదేశించారు.













