నంద్యాల టీడీపీ కోటకు బీటలు: 500 మంది అనుచరులతో వైఎస్సార్‌సీపీకి రేగాటి అనిల్‌రెడ్డి

నంద్యాల పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు మునిశేఖర్‌రెడ్డి మనవడు, యువ నాయకుడు రేగాటి అనిల్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో అనిల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలో భాగంగా సుమారు 500 మంది టీడీపీ కార్యకర్తలు, అనుచరులు వైఎస్సార్‌సీపీకి చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రేగాటి అనిల్‌రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో పాటు, యువతలో మంచి పరిచయాలు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. స్నేహితులు, అనుచరులతో సన్నిహితంగా ఉంటూ వారికి అండగా నిలిచే స్వభావం ఆయనకు ఉందని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి యువ నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

యువతను రాజకీయంగా ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ పనిచేస్తోందని శిల్పా రవి తెలిపారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తమ పార్టీ ముందుంటుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు యువత పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ వైపు రావడం రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపన, విద్యా సంస్థలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందని శిల్పా రవి గుర్తుచేశారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ ప్రవేశాలు ప్రారంభమైనట్లు విద్యా రికార్డులు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నంద్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం హయాంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని శిల్పా రవి తెలిపారు. సచివాలయాలు, మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ విద్య, మహిళా విద్యాసంస్థలు, ఉర్దూ విద్యా సంస్థలు తదితర రంగాల్లో పనులు చేపట్టినట్లు వివరించారు. తాము ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

నంద్యాలను అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికీ, ప్రజలకు కనిపించే స్థాయిలో కొత్త అభివృద్ధి పనులు ఏమున్నాయో చెప్పాలని శిల్పా రవి ప్రశ్నించారు. నంద్యాలను సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని గతంలో టీడీపీ నేతలు చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ, ఆ హామీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన పనులు ఎక్కడున్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రస్తుత పాలకులు సోషల్‌ మీడియా ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని శిల్పా రవి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డెక్కి ప్రజా సమస్యలను ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం స్పందిస్తోందని, ముందుగానే సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పాలన సాగడం లేదని ఆయన ఆరోపించారు.

నంద్యాలలో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు దోహదపడ్డాయని శిల్పా రవి పేర్కొన్నారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

నంద్యాలలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, టీడీపీ కార్యాలయానికి సంబంధించిన భూమి వ్యవహారంపై కూడా శిల్పా రవి పలు ప్రశ్నలు సంధించారు. ఈ అంశాలపై ప్రభుత్వం, టీడీపీ నాయకులు ప్రజలకు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా ఆయన విమర్శలు చేశారు.

తాను తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు శిల్పా రవి గుర్తుచేశారు. ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక వసతుల రంగాల్లో చేపట్టిన పనులపై తాము ప్రజల ముందే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పార్టీలో చేరిన మీకు రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ నాయకుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా వాటన్నిటిని అధిగమించి, రాబోయే స్థానిక మరియు 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పించి, మీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.

స్థానిక సంస్థల్లో మన పార్టీ మున్సిపాలిటీనీ కైవసం చేసుకోబోతున్నాం. ప్రస్తుత టీడీపీ నాయకులు అక్రమంగా వసూలు చేస్తున్న బిల్డింగ్‌ టాక్సులు అనేవి ఏమి ఉండవని పార్టీలో చేరిన యువతకు హామీ ఇస్తున్నాను.

రేగాటి అనిల్‌రెడ్డి చేరికతో నంద్యాల వైఎస్సార్‌సీపీలో యువతకు కొత్త ఊపు వచ్చిందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. యువ నాయకుడి ప్రవేశంతో నంద్యాల రాజకీయాల్లో సమీకరణాలు ఎలా మారతాయన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.