రాయలసీమ న్యూస్, కర్నూలు: జిల్లాలో జాతీయ రహదారులకు అనుబంధంగా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్లు, వాహన అండర్‌పాస్‌లు, బ్లాక్ స్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారులకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్‌హెచ్‌ను అనుసంధానించే ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి 10 రోజుల్లోగా పురోగతిపై తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
పాత కల్లూరు రోడ్డు నుండి హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ కేశవ్ గ్రాండ్ సమీపంలోని ప్రస్తుత రహదారిని అనుసంధానించే పనుల్లో భాగంగా, వచ్చే నెల నాటికి స్పష్టమైన పురోగతి కనిపించేలా మెటల్ రోడ్డు పనులు ప్రారంభించి, బస్సుల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాళ్లదొడ్డి గ్రామంలో ఉన్న S కర్వ్ కారణంగా అక్కడ ప్రతిపాదిత రహదారి విస్తరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు సమన్వయంతో పనిచేసి, వారం రోజుల్లోపు రహదారి సర్వే, మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె సూచించారు.
కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు చేపట్టనున్న రోడ్ విస్తరణ పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉల్చాలా జంక్షన్ అభివృద్ధి పనులను కూడా నిర్దిష్ట గడువులో పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
జాతీయ రహదారులపై ఆక్రమణలు తొలగించడంతో పాటు, రహదారి భద్రతకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై పెట్రోలింగ్ వాహనాలను చురుకుగా వినియోగించి, రహదారులపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్న భారీ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెట్రోలింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గాయాల తీవ్రత, రకాన్ని బట్టి గరిష్టంగా ₹2,50,000 వరకు చికిత్స ఖర్చులు మంజూరు చేయబడతాయని తెలిపారు.
ఈ పథకంలో సుమారు 58 నుండి 60 వరకు నిర్దిష్టమైన ఇంజురీ కోడ్లు ఉన్నాయని, బాధితుడి గాయాల స్థితిని బట్టి సంబంధిత కోడ్ ఆధారంగా ఆయా మొత్తాలు విడుదల చేయబడతాయని కలెక్టర్ వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చిన వ్యక్తిని గుడ్ సమారిటన్ గా గుర్తించి, ప్రోత్సాహకంగా పురస్కారం ఇవ్వబడుతుందని ఆమె తెలిపారు.
సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డిటిసి శాంతకుమారి, పంచాయతీ రాజ్ ఎస్ఈ ప్రభాకర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.













