నంద్యాల జిల్లా సంజామల మండలాన్ని ఖరీఫ్‌–2026 సీజన్‌కు కరువు ప్రభావిత మండలంగా ప్రకటించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేశారు. మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తేమ లోపం, ఎల్‌నినో ప్రభావంతో సంభవించిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి తెలియజేశారు.

ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌ ప్రఖర్ జైన్‌కు మంత్రి అక్టోబర్ 2న అధికారిక లేఖ పంపారు. నంద్యాల జిల్లా ఆర్థిక, గణాంకాల అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా సంజామల మండలంలో ఖరీఫ్‌–2026 సీజన్‌లో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 53.4 శాతం తక్కువగా నమోదైందని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే నిర్దేశిత డ్రౌట్‌ అసెస్‌మెంట్‌లోని తప్పనిసరి ట్రిగ్గర్‌–1కు అవసరమైన డ్రై స్పెల్‌ ప్రమాణం పూర్తి కాలేదని మంత్రి లేఖలో స్పష్టం చేశారు. అదే సమయంలో, ఆగస్టు 31, 2026 నాటికి అందుబాటులో ఉన్న కరువు అంచనా వివరాల ప్రకారం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సంజామల మండలంలో వాస్తవ పంటల సాగు గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు.

సాగు చేసిన పంటలు తేమ లోపం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి లేఖలో తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సమర్పించిన క్షేత్రస్థాయి నివేదిక ప్రకారం పంట నష్టం సుమారు 75 శాతంగా అంచనా వేయబడిందని, ఇది తీవ్ర నష్టం కేటగిరీలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తప్పనిసరి సూచికలు, ప్రభావ సూచికలు, క్షేత్రస్థాయి నివేదికలను సమగ్రంగా పరిశీలించినప్పుడు సంజామల మండలాన్ని ఖరీఫ్‌–2026కు కరువు ప్రభావిత మండలంగా ప్రకటించడం సముచితమని మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కరువు నివారణ, ఉపశమన చర్యల కింద సహాయం అందే అవకాశం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.