రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ యువకుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. వివిధ రంగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసీదేవి తెలిపారు.
ఈ శిక్షణలో భాగంగా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ , హోమ్ అప్లయెన్సెస్ టెక్నీషియన్, సోలార్ PV ఇంస్టాల్లెర్ కోర్సుల్లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలనుకునే ఎస్సీ యువతకు ఈ కోర్సులు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
కిసాన్ డ్రోన్ ఆపరేటర్ కోర్సు ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు. పంటల పర్యవేక్షణ, ఎరువుల, పురుగుమందుల పిచికారీ వంటి పనుల్లో డ్రోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. హోమ్ అప్లయన్స్ టెక్నీషియన్ కోర్సు ద్వారా గృహోపకరణాల మరమ్మతు, నిర్వహణలో నైపుణ్యాలు అందించనున్నారు. సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సు ద్వారా సోలార్ ప్యానెల్ వ్యవస్థల అమరిక, నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఆసక్తిగల ఎస్సీ యువతీ యువకులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సూచిస్తున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. నైపుణ్య శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ సదుపాయాలు కూడా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు కార్పొరేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ కాలంలో వసతి, భోజనం పూర్తిగా ఉచితంగా అందిస్తాం.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు వసతి, భోజనం, శిక్షణ సామగ్రి వంటి సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తులసీదేవి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉండే ఎస్సీ యువతకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













