రాయలసీమ న్యూస్, నంద్యాల: శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారిని పలురకాల పూలతో అలంకరించి, బిల్వదళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అర్చకులు, వేదపండితులు వేదమంత్రాల నడుమ, మంగళవాయిద్యాల మధ్య సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. శైలపుత్రీ అలంకారంలో ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవితో పాటు మల్లికార్జునస్వామిని భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూరహారతులు సమర్పించారు.
పూజా కార్యక్రమాల అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉత్సవమూర్తుల ముందుగా కోలాటాలు, చెక్కభజనలు, కేరళ నృత్యాలు, వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్య విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి, అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించారు. గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి, అమ్మవారిని భక్తులు మార్గమధ్యంలో దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాస రావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు, శైలపుత్రీ అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి.













