ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం స్థానం దక్కించుకుని విశేష గౌరవాన్ని సాధించింది. దేశంలో ఈ రికార్డులో చోటు దక్కిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం చరిత్ర సృష్టించింది. దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కడా లేని ప్రత్యేక సాంకేతిక లక్షణాలతో ఈ ప్రాజెక్టు నిలిచిన నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.

శ్రీశైలం జలాశయంలో ఏర్పాటు చేసిన గేట్లు 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తుతో ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలిచింది. ఇంత భారీ పరిమాణంలో గేట్లు దక్షిణాసియాలో మరెక్కడా లేవని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భారీ వరద ప్రవాహాలను నియంత్రించే సామర్థ్యంతో ఈ గేట్ల రూపకల్పన, నిర్మాణం జరిగిందని అధికారులు వివరించారు.

2009 సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరినప్పుడు, ప్రాజెక్టు నిర్వహణ, గేట్ల ఆపరేషన్ ద్వారా ఆ వరదను సమర్థంగా తట్టుకున్నారు. ఆ సమయంలో చూపిన సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యం, భద్రతా చర్యలు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలనలో కీలకంగా నిలిచాయి.

ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ శ్రీశైలం జలాశయాన్ని తమ రికార్డుల్లో చోటు కల్పించింది. ఈ మేరకు సంస్థ జాయింట్ సెక్రటరీ, ఇరిగేషన్ అధికారులకు ధ్రువపత్రాన్ని అందజేశారు. జలాశయ సాంకేతిక లక్షణాలు, వరద నిర్వహణ సామర్థ్యంపై సంస్థ ప్రతినిధులు వివరాలు సేకరించి, పరిశీలన అనంతరం ఈ గుర్తింపుని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం జలాశయానికి లభించిన ఈ గౌరవం రాష్ట్ర జలవనరుల రంగానికి, ఇరిగేషన్ విభాగానికి విశేష ప్రోత్సాహాన్ని అందజేస్తుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో పాల్గొన్న ఇంజనీర్లు, సిబ్బంది కృషికి ఇది ప్రతిఫలంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.