రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా జరగనున్న NEET-UG re-examకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా, ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులంతా తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
జాతీయ పరీక్షల సంస్థ NTA, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరికొన్ని గంటల్లో విద్యార్థులు పరీక్ష రాయబోతున్న నేపథ్యంలో, పరీక్ష సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి వారిని ఆందోళనకు గురి చేయకూడదని ఆయన కోరారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
అదే సమయంలో పెండింగ్లో ఉన్న CBSE ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
NEET-UG re-exam నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్ష రాయాలని NTA సూచించింది.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు , గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారని తెలిపింది. ఈ సమయం దాటితే ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని NTA పేర్కొంది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన NEET-UG పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు సహా పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు NEET-UG 2026 re-exam నిర్వహిస్తున్నారు. పరీక్షల సమర్థ నిర్వహణ కోసం మొత్తం రెండు లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు.
ఎలాంటి లోపాలు తలెత్తకుండా సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగేందుకు సంబంధిత యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.







