వేసవిలో ఉదయాన్నే ఏమి తినాలి? పోషకాహార నిపుణుల సూచనలు

వేసవి కాలంలో ఉదయాన్నే నీరసంగా, అలసటగా అనిపించడం చాలామందికి సాధారణం. పెరుగుతున్న ఎండల కారణంగా కొందరు ఉదయం అల్పాహారాన్ని సరిగ్గా తినకపోవడం, కొందరు పూర్తిగా మానేయడం కనిపిస్తోంది. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో అల్పాహారం చాలా కీలకం. శరీరానికి శక్తి, నీరు అందించడంలో, ఎండలను తట్టుకోవడంలో ఉదయపు ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

వేసవిలో అల్పాహారం ప్రాముఖ్యత

ఎండల వల్ల చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. Kellogg India కు చెందిన పోషకాహార నిపుణురాలు సూచనల ప్రకారం వేసవిలో తీసుకునే అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, పీచు పదార్థం, విటమిన్లు, ద్రవపదార్థాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.

సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్ సింపుల్ ఫార్ములా

ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధం చేయడం అంత కష్టమైన పని కాదు. ఒక సులభమైన ఫార్ములాను పాటిస్తే సరిపోతుంది:

1. తృణధాన్యాలు + పాలు లేదా పెరుగు + తాజా పండ్లు

2. ధాన్యాలు: ఇవి రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

3. పాలు లేదా పెరుగు: వీటిలో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12 కండరాలు, ఎముకలకు బలం ఇస్తాయి.

పీచు పదార్థం అవసరం

వేసవిలో జీర్ణక్రియ సవ్యంగా ఉండటానికి పీచు పదార్థం కీలకం. తృణధాన్యాలు, పీచు అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో అనవసరంగా జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇవి సహాయపడతాయి.

సీజనల్ పండ్ల ప్రయోజనాలు

వేసవిలో దొరికే పండ్లను అల్పాహారంలో తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, అరటి, బొప్పాయి, పుచ్చకాయ, బెర్రీలు వంటి పండ్లలో విటమిన్లు, పీచు, సహజమైన తీపి సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి రక్షితంగా ఉంటుంది.

ఉదయాన్నే ద్రవపదార్థాలు తప్పనిసరి

రాత్రంతా నిద్రపోయే సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఉదయాన్నే దానిని భర్తీ చేయడం అవసరం. అల్పాహారంలో పాలు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. రోజును ఒక గ్లాసు నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తాగుతూ ప్రారంభిస్తే శరీరం చల్లబడుతుంది. ఎండను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

తేలికైన, సింపుల్ అల్పాహారం

వేసవిలో అల్పాహారం ఎప్పుడూ తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. భారీగా, బరువుగా ఉండే ఆహారాలు తిని తర్వాత నీరసపడే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. తృణధాన్యాలు, పెరుగు, పండ్ల వంటి చల్లని, పోషకమైన కాంబినేషన్లను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సరైన అల్పాహారాన్ని ప్రతిరోజూ అలవాటు చేసుకుంటే వేసవి రోజులను ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.