ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్‌–14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు విజయవంతమైందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ నుంచి వస్తున్న అణుబాంబు ముప్పు నుంచి మేము మా దేశాన్ని కాపాడుకున్నాం. అవసరమైతే ఇంకోసారి కూడా దాడి చేస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న నెతన్యాహూ.. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి తేల్చిచెప్పారు.

ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య ఖతార్‌ మధ్యవర్తిత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్చల్లో ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్‌ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రతిపాదిత అవగాహన ప్రకారం.. ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై సాంకేతిక స్థాయి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

అమెరికా ఒప్పందానికి మేము కట్టుబడి ఉండం..
అయితే అమెరికా–ఇరాన్‌ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా.. అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్‌ దానికి కట్టుబడి ఉండబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌ సైనిక లేదంటే అణు సామర్థ్యం కొనసాగితే అవసరమైన చర్యలు స్వతంత్రంగా తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు ఫలిస్తాయా? లేదంటే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.