రూ. 954 కోట్ల కుంభకోణం

భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌

న్యూఢిల్లీ: సుమారు 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 954 కోట్లు) విలువైన భారీ ఆర్థిక కుంభకోణం కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. 44 ఏళ్ల మఖిజానిని బుధవారం ఉదయం కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో ఉన్న అతని విలాసవంతమైన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

కరోనా డెల్ మార్‌లో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్ మహేందర్ మఖిజాని, తన కంపెనీ Cantor Group V LLC ద్వారా రియల్ ఎస్టేట్ లోన్ల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువను కృత్రిమంగా పెంచి చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను నకిలీగా సృష్టించడం, మెటాడేటాను మార్చడం ద్వారా అసలు అప్పులను దాచిపెట్టినట్టు ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫస్ట్ అసిస్టెంట్ U.S. Attorney Bilal Essayli ప్రకారం, మఖిజాని ఒక ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులో నమోదు చేశారు. వివిధ ఖాతాల ద్వారా జరిగిన నిధుల బదిలీలను స్పెషల్ ఏజెంట్లు నిశితంగా పరిశీలించి, ఈ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్లు ఆయన తెలిపారు.

Internal Revenue Service (IRS) దర్యాప్తు వివరాల ప్రకారం, మఖిజాని టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తప్పుగా సృష్టించి, నిజమైన తాకట్టు స్థానాలను దాచిపెట్టాడు. షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించి బ్యాంకును తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక సంపన్న ప్రాంతంలో హోటళ్లు, ఒక రెస్టారెంట్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సాయుధ గుండాలను పంపినట్టు, డ్రగ్స్, సెక్స్ పార్టీలను నిర్వహించినట్టు కూడా కోర్టు పత్రాల్లో ప్రస్తావించారు.

2024 సెప్టెంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు మఖిజాని భీమా పత్రాలను ఫోర్జరీ చేసి, తాకట్టు పెట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులపై Cantor సంస్థకే మొదటి హక్కు (First Lien Position) ఉన్నట్లు చూపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నకిలీ పత్రాలను తన ఉద్యోగి ద్వారా సంబంధిత బ్యాంకుకు సమర్పింపజేశాడని, బ్యాంకు ప్రతినిధులతో ఫోన్ సంభాషణల్లో పత్రాల్లోని లోపాల గురించి అబద్ధాలు చెప్పి నమ్మించినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

కోర్టు పత్రాల ప్రకారం, మఖిజాని సెక్స్ వర్కర్లతో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేవాడని, ఆ పార్టీలకు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ పార్టీల్లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని, బ్యాంకు సిబ్బందిని, తన వ్యాపార భాగస్వాములను బ్లాక్‌మెయిల్ చేస్తూ తన నియంత్రణలో ఉంచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన కింద పనిచేసే సిబ్బందిని బెదిరిస్తూ, తనకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తానని, వారి కుటుంబాలను, పిల్లలను రోడ్డు మీద పడేస్తానని హెచ్చరించినట్టు కూడా కోర్టు దస్తావేజుల్లో ఉంది.

ఇక గత నెలలో జరిగిన ఒక మధ్యవర్తిత్వ విచారణలో వ్యాపారవేత్త Mohammad Honarkar‌తో మఖిజాని జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు తేలింది. దీనిపై కోర్టు మఖిజాని సుమారు 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం మఖిజాని పై నమోదైన ఫెడరల్ కేసు విచారణ కొనసాగుతోంది.