రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ వరుస దాడులు కొనసాగించడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా రష్యా అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై భారీ దాడి ప్రారంభించింది. కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
రాజధాని నగరం కీవ్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడుల్లో అనేక నివాస భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక సమాచారం చెబుతోంది. రష్యా ఈ దాడిలో బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను వినియోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
తాజా దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించిన తరువాత, కీవ్ సహా పలు నగరాల్లో ప్రజలు మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. ఇది భయంకరమైన శత్రు దాడి అని ఉక్రెయిన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఇప్పటి వరకు ఒకరు మరణించారని, 11 మంది గాయపడ్డారని అధికారికంగా వెల్లడించింది.
ఇదిలా ఉంటే, గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ ప్రతిరోజూ వందల డ్రోన్‌లతో రష్యాపై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల వల్ల రష్యా ఇంధన రంగం, రక్షణ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలు తయారు చేసే కార్మాగారాలు, సైనిక స్థావరాలు, ఇంధన నిల్వ కేంద్రాలు ఉక్రెయిన్ దాడుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి.
ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని చమురుశుద్ధి కార్మాగారాలకు గణనీయమైన నష్టం వాటిల్లిన నేపథ్యంలో, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలు యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.







