సొమ్మును నేరుగా ఇవ్వం

ఇరాన్‌లో ఆహార కొరత తీరుస్తాం ..: ట్రంప్‌

ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం విదేశాల్లోని ఆ దేశ ఆస్తులను విడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (US President Trump) వెల్లడించారు. అయితే ఈ నగదు టెహ్రాన్‌కు నేరుగా చేరదని.. ఆ నిధులను ఇరాన్‌లోని ఆకలి సమస్యను తగ్గించడానికి అమెరికా రైతుల నుంచి మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు (US goods) ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్‌ ఆస్తులను విడుదల చేస్తే.. అవి తమ దేశంలోని రైతులను ధనవంతులుగా చేయడానికి.. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగపడతాయన్నారు. 

ఒప్పందంలో ఆ విషయం లేదు: ఇరాన్‌

ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఇరాన్‌ మండిపడింది. ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్ ఘాలిబాఫ్‌ స్పందిస్తూ.. తమ ఆస్తులతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తామని అమెరికా తప్పుగా వాదిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా వస్తువుల కొనుగోలును తప్పనిసరి చేసే ఎలాంటి చట్టపరమైన నిబంధనలు అవగాహనా పత్రంలో లేవని అన్నారు. విదేశాల్లోని తమ ఆస్తులను విడిపించి ఇవ్వాలని ఒప్పందంలో భాగంగా అగ్రరాజ్యానికి ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ట్రంప్‌ ఇలాంటి ప్రకటన చేయడం అమెరికా ఓటమికి నిదర్శనమన్నారు.