ఒక భారతీయ కంపెనీ సహా పలు సంస్థలు, ఎనిమిది మంది వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. సుడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు చెందిన ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్‌ వెల్లడించింది. సూడాన్ సాయుధ దళాలు (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ (RSF) మధ్య ఘర్షణ తీవ్రతరం కావడానికి ఈ సంస్థలు కారణమవుతున్నాయని పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ రెండు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలతో సుడాన్‌లో అంతర్యుద్ధం నడుస్తోంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం ఏర్పడింది.

ఆంక్షలు ఎదుర్కొంటున్నవారిలో రాయ్‌పుర్‌కు చెందిన అలోక్‌ చౌధరీ ఒకరు. అతడు ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌కు సీఈఓగా ఉన్నారు. దీనికి మరోపేరు అమిన్ ఎక్స్‌ప్లోజివ్‌ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్‌ఏఎఫ్‌కు చెందిన ఆయుధగారాన్ని నిర్వహించే సంస్థకు అమిన్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీ పేలుడు పదార్థాలున్న 200 షిప్‌మెంట్లను సప్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌తో పాటు సూడాన్‌, ఈజిప్ట్ కేంద్రంగా నడుస్తోన్న సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ‘‘ఈ సంస్థలు సూడాన్ దళాలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ ఫైటర్లను సరఫరా చేస్తుండటంతో ఘర్షణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. దీంతో మానవతా సంక్షోభం ఏర్పడటమేగాకుండా.. ఉగ్రవాద గ్రూపులు చెలరేగడానికి అవకాశం ఏర్పడింది’’ అని యూఎస్ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగాట్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితులతో అక్కడ అత్యాచారాలు, లైంగిక హింస విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని గతంలో ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది.