రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాన్ని శోకసముద్రంలో ముంచేశాయి. వరుస ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదవుతోంది. మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండగా, గల్లంతైన వారి సంఖ్య లక్షల్లో కాకపోయినా వేలల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెనెజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 4,300 మంది గాయపడినట్లు వెల్లడించింది. భవనాల శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉన్నారని, వారిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వెనెజువెలా రాజధాని కారకాస్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భూమి తీవ్రంగా కంపించింది. అయితే అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లా గువేరా తీర నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. భూకంపం ధాటికి ఈ నగరం అతలాకుతలమైంది. అక్కడ ఒక్కటే 100కు పైగా భవనాలు నేలమట్టమైనట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఐరాస ప్రతినిధులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, బయటకు తీయడం చాలా క్లిష్టంగా మారిందని, శిథిలాలను పూర్తిగా తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా శిథిలాల దిబ్బలుగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. తక్కువ లోతులో సంభవించిన ఈ భూకంపాల తీవ్రత కారణంగా నష్టం మరింత పెరిగిందని నిపుణులు సూచిస్తున్నారు.
భూకంపాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని వెనెజువెలా ప్రభుత్వాన్ని ఐరాస ప్రతినిధులు కోరారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కీలక సమాచారం వేగంగా చేరుతుందని, సహాయక చర్యలు సమన్వయం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనెజువెలా పౌరులకు ‘ఎక్స్’ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. 2024లో మదురో అధికారంలో ఉన్న సమయంలో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
ఇక ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాకు అంతర్జాతీయ సమాజం చేయూతనిస్తోంది. 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. దీనిని తరలించేందుకు రెండు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య బృందాలు, మానవతా సాయం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.







