రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే IIT ఫౌండేషన్ విద్య అందించాలని ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రాథమిక దశ నుంచే IIT, NEET సిలబస్ బోధించేలా ప్రత్యేక విద్యా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఈ కోర్సులు బోధించాలంటే MScలో ఫిజిక్స్ , కెమిస్ట్రీ , బోటనీ , జూలోజి వంటి విభాగాల్లో చదివిన అభ్యర్థులు అవసరం.
అయితే స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్థులు తక్కువగా ఉండటంతో, ఇతర ప్రాంతాల నుంచి MSc పూర్తి చేసిన వారిని ఆహ్వానించి బోధన బాధ్యతలు అప్పగిస్తున్న పరిస్థితి నెలకొంది. కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువత ఈ అవకాశాలను పెద్దగా వినియోగించుకోవడం లేదు. చాలామంది MSc కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే స్థానికంగానే కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
ఇంటర్ పూర్తి చేసుకున్న యువతలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే డిగ్రీలో BSc చేసి, అనంతరం MSc పూర్తి చేస్తే స్వస్థలంలోనే పలు ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయని విద్యావర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్నూలు నగరంలోని Dr. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ లో MSc కంప్యూటర్స్ , రాయలసీమ యూనివర్సిటీ లో MSc బోటనీ , జూలోజి , ఫిజిక్స్ , మాథెమాటిక్స్ , కంప్యూటర్ సైన్స్ , క్లస్టర్ యూనివర్సిటీ లో MSc బోటనీ , జూలోజి , మాథెమాటిక్స్ అండ్ కంప్యూటింగ్ , కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
2025–26 విద్యా సంవత్సరానికి Dr. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ లో 30 MSc సీట్లకు గాను 14 మంది మాత్రమే, క్లస్టర్ యూనివర్సిటీ లో 132 సీట్లకు 15 మంది, రాయలసీమ యూనివర్సిటీ లో 175 సీట్లకు 60 మంది అభ్యర్థులు మాత్రమే చేరారు. అందుబాటులో ఉన్న సీట్లతో పోలిస్తే ప్రవేశాలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి MSc బోటనీ , జూలోజి , మాథెమాటిక్స్ , కంప్యూటర్స్ కోర్సుల్లో క్లస్టర్ యూనివర్సిటీ లో 132, రాయలసీమ యూనివర్సిటీ లో 175, ఉర్దూ యూనివర్సిటీ లో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సులకు ప్రవేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. డిగ్రీలో BSc పూర్తి చేసిన అభ్యర్థులు ఈ విద్యా సంవత్సరంలో అయినా MSc కోర్సుల్లో చేరితే, రాబోయే రోజుల్లో స్థానికంగానే కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇతర విద్యా సంస్థల్లో ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.













