రాయలసీమ న్యూస్, కర్నూలు:
రాయలసీమను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపేలా భారీ ఉద్యాన హబ్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టును సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. త్వరలోనే ఈ హబ్‌కు శంకుస్థాపన జరగనుందని తెలిపారు.
బుధవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం ఉత్పత్తి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, జొన్నగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ అభివృద్ధి, కర్నూలు జిల్లాలో చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టులపై వివరాలు వెల్లడించారు.
ఓర్వకల్లులో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయం, రక్షణ రంగాలకు అవసరమైన డ్రోన్ల తయారీ, డ్రోన్ అప్లికేషన్ల అభివృద్ధి ఈ సిటీలోనే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. డ్రోన్ అప్లికేషన్ పరిశ్రమలకు అనుసంధానంగా రహదారి సదుపాయాల కోసం ఇప్పటికే రూ.10 కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వివరించారు.
కర్నూలు-బళ్లారి రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు నుంచి హైదరాబాద్, బెంగళూరు దిశగా ప్రయాణించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా హైస్పీడ్, బుల్లెట్ రైళ్ల సేవలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కల త్వరలోనే నెరవేరేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాయలసీమలో ప్రతిష్టాత్మక ఉద్యాన హబ్ ఏర్పాటుతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే వివిధ ఉద్యాన పంటలకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాసెసింగ్, నిల్వ, ఎగుమతుల వరకు సమగ్ర సదుపాయాలు కల్పించేలా ఈ హబ్ రూపకల్పన జరుగుతోంది. స్థానిక రైతులకు ఉపాధి, ఆదాయ వనరులు పెరగడంతో పాటు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందనున్నాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
జొన్నగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, జయనాగేశ్వర రెడ్డి, డా.పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, జియో మైసూర్ సంస్థ ఎండీ ప్రభాకరన్, డైరెక్టర్ కార్తికేయన్, గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా, కలెక్టర్ డా.ఏ.సిరి, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.













