న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి లేనప్పటికీ అక్టోబర్‌ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగానైనా నిర్వహిస్తామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కార్యకర్త అభిజీత్‌ దీప్కే మరోసారి స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి ఉన్నా లేకున్నా నిరసన కొనసాగుతుందని, అరెస్టులను ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

నిరసన నేపథ్యంలో ఢిల్లీలో అమలు చేస్తున్న ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ భయం దేనికని, దేశంలోని యువతను చూసి ఎందుకు ఇంతగా భయపడుతున్నారని కేంద్రాన్ని నిలదీశారు. రైళ్లు, మెట్రో సేవలను నిలిపివేస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అభిజీత్‌ దీప్కే విమర్శించారు. ప్రజా రవాణా, రోడ్లపై విధిస్తున్న ఆంక్షలు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఢిల్లీ ప్రధాని మోడీ లేదా అమిత్‌ షాల ఆస్తా, లేక వారి పూర్వీకుల ఆస్తా, లేక వారి తండ్రి ఆస్తా కాదని కేంద్రాన్ని నిలదీశారు. ఒకవైపు నిరసనల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని కేంద్రం చెబుతూనే, మరోవైపు మెట్రో, రైల్వే సేవలను నిలిపివేసి, రోడ్లన్నింటినీ మూసివేస్తోందని ఆయన విమర్శించారు. రైల్వే సేవలను నిలిపివేసి, రోడ్లపై ఆంక్షలు విధిస్తే ప్రజలకు ఇబ్బంది కలగదా అని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ, అమిత్‌ షాలు తరచూ రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. నిరసన చేపట్టితీరతామని, నిర్బంధానికైనా లేదా అరెస్టుకైనా తాము సిద్ధంగా ఉన్నామని అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. ఎంతమందిని నిర్బంధిస్తారని కేంద్రానికి సవాలు విసిరారు. తాను, సౌరవ్‌, అశుతోష్‌ సహా కార్యకర్తలంతా అరెస్టులకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పోలీసు అనుమతి అవసరమా అన్న ప్రశ్నకు స్పందిస్తూ జంతర్ మంతర్ అనేది నిరసనల కోసం కేటాయించిన ప్రదేశమని ఆయన గుర్తుచేశారు. 13 కోట్ల మంది ఓట్లను తొలగించే ముందు జ్ఞానేష్‌ కుమార్‌ ఎవరి అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. 'ఫారం 6' సవరణను సుప్రీంకోర్టు కూడా ఆమోదించలేదని, అయినప్పటికీ జ్ఞానేష్‌ కుమార్‌ ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ అడగకుండా 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం తమకు ఉన్న హక్కును వినియోగించుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల కోసం కనీసం 10 రోజుల ముందే దరఖాస్తులు సమర్పించాలన్న ఢిల్లీ పోలీసుల ప్రకటనను, ఆ నిబంధనలను ఈ నిరసనతో ముడిపెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.