రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే
: సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఇంకా ప్రయగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దాని ఫలితాలు వచ్చే ఏడాదికల్లా వెల్లడి అవుతాయని తెలిపింది. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటోందని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు నెలకొన్న వేళ ప్రభుత్వం నుంచి ఈ సమాధానం వెలువడడం గమనార్హం. ఈ20 వల్ల ఇంధన భద్రత, పర్యావరణానికి ప్రయోజనకరం అని కేంద్రం పేర్కొంటోంది. ఈ క్రమంలో ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించింది.
తమ వద్ద నుంచి ఇథనాల్ కొనుగోళ్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ..కర్ణాటక హైకోర్టును డిస్టిలరీ కంపెనీలు ఆశ్రయించాయి. దీంతో సరఫరాదారులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వరంగ చమురు కంపెనీ అయిన బీపీసీఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బీపీసీఎల్ తరఫున వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ20 పెట్రోల్ ప్రక్రియ ప్రయోగాత్మకంగా జరుగుతోందని, దీని ప్రభావం వచ్చే ఏడాది కనిపిస్తుందని తెలిపారు.
అయితే, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌కు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. అటార్నీ జనరల్ స్పందించారు. 2025 అక్టోబర్‌లోనే సప్లయ్ కాంట్రాక్టులు ఖరారయ్యాయని తెలిపారు. ఇదే తరహా కేసులు పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ డివిజన్ బెంచ్‌కు వెళితే, ఇతర హైకోర్టుల నుంచి ఇదే తరహా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనివల్ల ఈ20 పాలసీకి విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌లోపు సప్లయ్ కాంట్రాక్టులు రెన్యువల్‌కు వస్తాయని, ఆలోపు దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇథనాల్‌కు డిమాండ్‌ను బట్టి కంపెనీలకు సరఫరా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.







