జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసుల్లో ఈడీ దూకుడు

కీలక సాక్షులకు నోటీసులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది. మూడు ప్రముఖ సంస్థలపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కీలక సాక్షి దండా నాగేంద్ర కుమార్‌కు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 50 కింద అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ నోటీసులు జారీ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో నాగేంద్ర కుమార్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ(NGT), సుప్రీంకోర్టులలో గత జగన్ ప్రభుత్వంపై అమరావతికి చెందిన దండా నాగేంద్ర కుమార్ కేసులు వేశారు. దీంతో ఆయనను ఈడీ కీలక సాక్షిగా పరిగణిస్తోంది. నాగేంద్ర కుమార్ ఆరోపణలతో ప్రతిమ ఇన్‌ఫ్రా, జైప్రకాష్ పవర్ వెంచర్స్, జీసీకేసీ(GCKC) ప్రాజెక్ట్స్ సంస్థలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. సదరు సంస్థల అక్రమ ఇసుక మైనింగ్ ఆపరేషన్లపై నాగేంద్రను ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కోరారు. ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ నకళ్లతో పాటు మైనింగ్ ఆధారాలు సమర్పించాలని స్పష్టీకరించింది. సెక్షన్ 50(2), 50(3) కింద ఈ విచారణను న్యాయపరమైన ప్రక్రియగా ఈడీ పరిగణించనుంది.